సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Saturday, June 25, 2011

హనుమంతుని కధలు – హనుమ సహాయంతో పురుషమృగంపై భీముని విజయం

హనుమంతుని కధలు – హనుమ సహాయంతో పురుషమృగంపై భీముని విజయం



శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)
శ్రీరామ
జయ హనుమాన్

Bhima Hanuman


శిష్యుడు- గురువుగారూ! మనమింకా ద్వాపరయుగంలో ఉన్నామండీ. పురుష మృగం తేవటం కోసం భీముడు బయలుదేరాడు. సోదరుని పరీక్షించి తన సహాయం అందించాలని హనుమంతుడు నిశ్చయించుకొని అడ్డంగా ఉండి భీముని బల గర్వాన్ని పోగొట్టాడు.


గురువుగారు – మార్గాన్ని నిరోధించి తన బలగర్వాన్ని పోగొట్టిన హనుమంతుని భీముడు స్తుతించాడు. హనుమంతుడు సౌమ్యరూపం పొంది ముఖపద్మాన చిరునవ్వులు చిందులాడగా భీమునితో ఈ విధంగా అన్నాడు. “ఓ రాజకుమారా! భీమసేనా! నన్ను అంజనాసుతుడగు హనుమంతునిగా తెలుసుకో. వాయుపుత్రుడనటంవల్ల నీకు సోదరుణ్ణి. పురుషమృగాన్ని తేజూచే నీ యీ సాహసాన్ని చూహి సోదర ప్రేమ వలన కలత పొంది ఇక్కడ కూర్చొని ఉన్నాను. మనోవేగం కల్గినట్టి, గొప్ప పరాక్రమం కల్గినట్టి, మనుష్యులే ఆహారంగా కలిగి ఉన్న పురుష మృగం మనస్సుకంటెను ముందుగా క్షణంలో మార్గాన్ని అతిక్రమించగలదు. మనుష్యులుగాని, రాక్షసులుగాని, తుదకు యముడైన తన ఎదుట నిలువలేరని ఆ పురుషమృగం యొక్క అభిప్రాయం అటువంటి మృగాన్ని తీసికొని రావటానికి నీవెలా సమర్థుడవు? ఓ నా సోదరా! భీమా! పరాక్రమమెంతగ కలది అయినా, పురుషులే ఆహారంగా కలది అయినా ఆ పురుష మృగాన్ని నా సోదరుడవయిన నీవు తీసికొని వెళ్ళలేక తిరిగి వెళ్ళటమనేది జరగకూడదు. కాబట్టి దానిని తీసికొని రావటంకోసం ఉపాయం చెప్తున్నాను విను. ఆ పురుషమృగం శుభప్రదమైన ఆచారం కలది. ఎల్లప్పుడూ శివపూజ చేసేటటువంటిది. ప్రాణాపాయం సంభవించినా అది శివపూజ మాత్రం వీడదు. అంతేకాదు. ఎక్కడైనా శివలింగంకల శుభప్రదమైన దేవళం ఎదురుగా కన్పడిందా పూజార్హమైన దానిని పూజింపక ఒక్క అడుగుకూడా ముందువేయదు. అని అంటూనే ఆ ఈశ్వరాంశ సంభూతుడైన హనుమంతుడు తన తోక చివరి వెంట్రుకలను కొన్నిటిని తీసి ‘భీమా! ఇవిగో! ఈ వెంట్రుకలను మార్గ మధ్యంలో విడివిడిగా వదులు. అలా వదలిన రోమాలు శివలింగాలుగా మారి వాటిపైన ఆలయాలు కూడా ఏర్పడుతాయి. అప్పుడా ఆలయాలలో పురుషమృగం పూజ చేయవలసి వస్తుంది. ప్రయాణంలో ఈ విఘ్నాలు ఏర్పడకపోతే నిన్ను వెంటనంటి వచ్చే ఆ పురుషమృగం నిన్ను కబళించేస్తుంది. ఇవిగో! ఈ వెంట్రుకలను తీసుకో’ అని ఇచ్చాడు. ఇంకా కర్తవ్యాన్ని బోధిస్తూ హనుమంతుడు ‘ఓ అనుజుడా! ఈ వెంట్రుకలను తీసికొని శీఘ్రంగా ఆ పురుష మృగం సమీపానికి వెళ్ళు. మృగ విధాన్ననుసరించి దానిని ప్రార్థించు. ఆ మృగం చెప్పిన మాటల నాలకించు. గురుతులబట్టి వేగంగా ముందుకు వెళ్తూ విడిగా ఒక్కొక్క వెంట్రుకనే పడవేస్తూ వెళ్ళు. ఇలా దేవ సభ అయిన సుధర్మ మొదలుకొని భోజనశాల వరకూ వేగంగా ముందు పరుగెత్తుతూ పొరపాటు చెందకుండా వెళ్ళు. మార్గమధ్యంలో నీవు దానికి దొరికావా? అది నిన్ను భక్షించివేస్తుంది. ఎప్పుడైతై ఒక్కొక్క రోమం వదలి శివలింగము ఉద్బవింపజేశావో వాటి అర్చనకారణంగా మార్గమధ్యంలో నిన్ను ఆ మృగం అతిక్రమించలేదు. కబళించలేదు. ఆ విధంగా అయితే నీకు తప్పక ఈ కార్యంలో విజయం చేకూరుతుంది” అని తోకవెంట్రుకలు గుప్పెడు భీమునకందజేశాడు. పురుషమృగా హరణంలో మంచి ఉపాయం లభించినందుకు భీముడు పరమానందమంది హనుమంతుని గొప్పగా స్తుతించి ఇలా అన్నాడు.

Read the rest of this entry »

by Dr Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

No comments:

Post a Comment