సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Sunday, November 21, 2010

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-4

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-4





 బ్రహ్మాండపురాణాంతర్గత తీర్ధఖండంలోని ఐదవ అధ్యాయములో అంజనాద్రి విషయము ఇలా చెప్పబడింది--
అంజనాదేవి వ్యుత్పత్తిక్రమము:  నారదమహర్షి భృగుమహర్షితో అంజనాదేవి వృత్తాంతమును ఇలా చెప్పెను-
                                                                      పూర్వము త్రేతాయుగములో కేసరి అను పేరు గల రాక్షసరాజు ఉండెను. అతడు పుత్రులు కావాలనే కోరికతో శంకరుని గురించి తపస్సు చేసెను. నిరాహారుడై, జితేంద్రియుడై పంచక్షరీమంత్రజపముతో శంకరుని సంతోషపెట్టెను. అతని తపస్సునకు సంతోషించిన శంకరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. రాక్షసుడైన కేసరి ధీరుడైన బుధ్ధిమంతుడైన పుత్రుని కోరును. అప్పుడు శంకరుడు 'బ్రహ్మ నిన్ను పుత్రహీనునిగా చేశాడు. కాబట్టి నీకు పుత్రిక కలుగుతుంది. ఆమెకు అమిత బలవంతుడు,తేజస్వీ అయిన పుత్రుడు కలుగుతాడు. అలా నీ మనుమని ద్వారా నీ కోరిక నెరవేరుతుంది.' అని చెప్తాడు. తనకిష్టమైన వరం పొందినవాడై ఆ రాక్షసరాజు పరమానందపడతాడు.    అనతికాలంలోనే ఆయనకు ఓ ఆడశిశువు కలుగుతుంది. ఆమెకు అంజన అని నామకరణం చేస్తాడు రాజు. ఆమె క్రమేణా వృధ్ధి పొంది కన్య కాగా తన మనోరథసిధ్ధి (అనగా కోరిక నెరవేరు సమయము) కొద్ది కాలములోనే కలుగబోతోందని ఆ రాక్షసరాజు తలచెను.
                                                  ఒకనాడు కేసరి అనే కపిశ్రేష్ఠుడు రాక్షసరాజైన కేసరిని తనకు అంజనాదేవినిచ్చి వివాహం చేయమని అడుగుతాడు.రాక్షసరాజు కేసరి సంతోషించి కపిశ్రేష్టుడైన కేసరికి అంజననిచ్చి వివాహం చేస్తాడు. చాలాకాలం అంజనకు సంతానం కలుగదు. కూతురుకి పుట్టే కొడుకు కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. అంజన చాలా బాధపడుతుంది. పుత్రహీనలైన స్త్రీలకు పారలౌకిక సుఖం ఉండదు కదా! పిత్రు ఋణమునుండి తనకు విముక్తి కలగదేమోనని దుఃఖిస్తుంది.పుత్రుని కోసం బ్రాహ్మణులను పూజించి ఆశీస్సులను పొంది వారుకోరిన దానమిచ్చేది.అనేకవ్రతములనాచరిస్తూ ఉపవాసాలతో జగదీశ్వరుని తృప్తిపరిచింది.                                                      



Written by Dr. Annadanam Hanumath Prasad in the book "Sri Hanuman Janmasthalam - Anjanadri"

http://www.jayahanumanji.com/
                                                                                                                                                                            

No comments:

Post a Comment